Saturday, February 4, 2017

బోల్షివిక్ విప్లవం


                                                                బోల్షివిక్ విప్లవం

బోల్షివిక్ విప్లవం జరిగి వందో సంవత్సరం జరుగుతున్న సందర్భంగా మనం ఈ విప్లవాన్ని గురించీ, దాని చారిత్రక ఆవశ్యకత,
అనివార్యతలను గురించీ తెల్సుకుందాం. 

1.‘‘బోల్షివిజం, లెనినిజం--ఈ రెండూ సమానార్ధకంగా వాడబడుతున్నా, మార్క్సిస్టు  సోషలిస్టు విప్లవం యొక్క గమనం,
ఆచరణను తెలియజేసేదేమో ' బోల్షివిజం' అయితే, సోషలిస్టు విప్లవం యొక్క  సిద్ధాంతం, ఆచరణను గూర్చిన  సైద్ధాంతిక
విశ్లేషణ నిచ్చేదే ' లెనినిజం' అవుతుంది. ’’(‘ఎ డిక్షనరీ ఆఫ్ మార్క్సిస్ట్ థాట్’గ్రంథం నుండి , అనువాదం--వై.వి.ఆర్.)
లెనినిజం అంటే--‘‘శ్రామిక (కార్మిక +కర్షక) వర్గ పోరాటం ; పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని ఖచ్చితంగా విశ్లేషించే పద్ధతి ;
కార్మికవర్గ  నియంతృత్వాన్నీ, ప్రజాస్వామిక కేంద్రీకరణను ఉన్నత శిఖరాలకు చేర్చినదీ ; సోషలిస్టు భావన, సంస్కృతులను
ప్రపంచానికి పరిచయం చేసినదీ. ’’
2.బోల్షివిక్ పార్టీ చరిత్ర :
‘‘1903లో జరిగిన RSDLabour Party రెండవ కాంగ్రెసు సమావేశంలో లెనిన్ బోల్షివిజాన్ని ఒక రాజకీయ
ఆలోచనగా, పార్టీగా ముందుకు తెచ్చాడు.  అందులోనే, 'మార్టోవ్' అనునతనితో విభేదించి, సంప్రదాయ కార్మిక ఉద్యమ 
నాయకత్వం (ట్రేడ్ యూనియన్) క్రిందనూ, ఇతర సోషల్ డెమొక్రటిక్ పార్టీల నుండీ వచ్చిన వారు బోల్షివిక్ పార్టీలో సభ్యులుగా
ఉండటాన్నీ కాదనాలనీ; బదులుగా, అంకితభావం గల జీవితకాల రాజకీయ కార్యకర్తలే 'బోల్షివిక్ పార్టీ సభ్యులు'గా వుండాలనీ
ప్రతిపాదించాడు.  అలా రెండు గ్రూపులుగా విడిన RSDLP, 'బోల్షివిక్కులు',అంటే--'మెజారిటీ' లేదా 'విప్లవాత్మకమైన'
అన్న అర్ధం గల వర్గంగానూ, ' మెన్షవిక్కులు ' , అంటే--' మైనారిటీ ' లేదా  'తక్కువ విప్లవ చైతన్యం గలవారు ' అనబడే
వర్గంగానూ ఏర్పడింది. 1917 ఏప్రిల్ కాంగ్రెసు సమావేశంలో ఈ బోల్షివిక్ పార్టీ, అధికారయుతంగా RSDLP 
(BOLSHEVIC)గా మారింది ; 1918 మార్చి నుండి ' రష్యన్ కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్)' గా మారింది ;
1952 సం// నుండి  ' కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ ' గా మారింది. ’’
                     (‘ఎ డిక్షనరీ ఆఫ్ మార్క్సిస్ట్ థాట్’గ్రంథం నుండి , అనువాదం--వై.వి.ఆర్.) 
3. రష్యన్ విప్లవానికి భూమిక :
     ఆనాటి రష్యన్ సమాజ పరిస్థితులైన , ఒకవైపు--దశాబ్దాల తరబడి  జారు చక్రవర్తుల నిరంకుశాధికారం,
దమనకాండ, పేదరికం, దోపిడీల నుండీ,విశృంఖల అసమానతల నుండీ ; మరోవైపు, జపాన్ సామ్రాజ్య కాంక్షకూ, 
యూరపులోని ప్రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల దురాక్రమణలనుండీ తమ్ముతాము కాపాడుకునే, నిల్పుకునే ప్రయత్నాల్లో 
నాటి రష్యన్ ప్రజలు అమేయ ధైర్యసాహసాలు చూపించాల్సి వచ్చింది.  కానీ, వీటి మాటునే తమ సొంత పార్టీలోనే అతివాద, 
మితవాద, మధ్యేవాద, దుందుడుకుతనం కల్గిన, సైద్ధాంతిక వెలితి కల్గిన, క్రమశిక్షణ లోపించిన, చారిత్రక అవగాహన లేమి,
సమాజగతి నియమాలు తెలీని గ్రూపులు కూడా నిరంతరం, కచ్చాపచ్చాగా తమ అధికారం కోసమూ, తెలీనితనంతో చేసే 
చర్యల మూలంగానూ,  అనైక్యంగా ఉన్నాయి.  ఇక అప్పుడు, మార్క్స్ అందించిన గతితార్కిక చారిత్రక భౌతికవాదం
సహాయంతో సోషలిస్టు రాజ్య స్థాపన సాధించే చిత్రాన్ని లెనిన్ అత్యంత శ్రమకోర్చి, బాధ్యతాయుతంగా, ఎంతో చాకచక్యంగా
రష్యన్ ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 1905 లో జరిగిన ప్రధమ రష్యన్ విప్లవం అనదగిన దాంట్లో, ఈ ప్రజలే 
బారికేడ్ల సహాయంతో, వీధి పోరాటాలతో, కరపత్రాలు, పత్రికలు, సభలు, సమావేశాలు, మొదలైన వాటి ద్వారా జార్
చక్రవర్తుల నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా పోరాడారు.  పోరాటపటిమ ఉన్నా, అనుభవలేమి వల్ల, నాటి 1905 విప్లవం
అణచబడింది. అయితే, తర్వాత మరింత దీక్షతో లెనిన్, అతని అనుయాయులు, ఇతరులను కల్పుకుంటూనే అనేక విధాలుగా
విప్లవక్రమాన్ని కొనసాగించారు.    1914-18 సం// వరకు జరిగిన మొదటి ప్రపంచయుద్ధంలో అనేక లక్షల మంది రష్యన్లు
యూరప్ దేశాల సామ్రాజ్యవాదానికి బలైపోయినా, దాని గమనం, సామ్రాజ్యవాద కాంక్షపై సరైన విశ్లేషణ చేయగల్గిన లెనిన్,
ఈ యుద్ధాన్ని ' సోషలిజం సాధించేందుకు ఒక మార్గం ' గా మలచవచ్చుననీ, దానికి ఇదే తగిన చారిత్రక సందర్భం అనీ
తెల్సుకుని,  పార్టీలోని వారికి అర్ధమయ్యేలా చేసి, వారి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి, వారిని 1917 విప్లవానికి సన్నద్ధం  చేశాడు. 
దీనిని సాధించటానికి లెనిన్, అంతకుముందు క్రమశిక్షణలేని, గాలివాటపు పోరాటాలను  కాదని, సుశిక్షితులైన, అంకితభావం 
గల జీవితకాల సభ్యులైన రాజకీయ కార్యకర్తలు అవసరమని గుర్తించాడు.  అందుకోసం, ' ప్రజాస్వామిక  కేంద్రీకరణ '
(DEMOCRATIC CENTRALISM) అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు.  దీని ద్వారా, సభ్యులు పార్టీ నాయకత్వాన్ని
ఎన్నుకోవటంలోనూ, తమ అభిప్రాయాలను తెలియజేయటంలోనూ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలి ; ఒకసారి పాలసీ
నిర్ణయాలు జరిగాక, ఎట్టి మినహాయింపులూ లేకుండా సభ్యులందరూ కేంద్రకమిటీ తీసుకునే ఆ నిర్ణయాలను శిరసావహిస్తూ, 
అమలు పరచాల్సిందే.  కేవలం ఈ పద్ధతిలో మాత్రమే, బూర్జువాలకు వ్యతిరేకంగా శ్రామికవర్గం  చేసే విప్లవాత్మక పోరాటం 
విజయం సాధించగలదని నొక్కి చెప్పబడేది.  అయితే, తర్వాతి కాలంలో ఈ కేంద్రకమిటీ అజమాయిషీ చాలా రెట్లు పెరిగి-
పోయిందనీ, ఈ నమూనాను మిగతా దేశాలు (ఇండియా లోని నేటి కమ్యూనిస్టు పార్టీలు కూడా) ఆచరించి, పార్టీలో 
ప్రజాస్వామ్య విధానం  నామమాత్రంగా జరగటానికి ఆస్కారమిచ్చాయనే  విమర్శల్లో  నిజం వుంది.
     అవకాశవాది అయిన బకూనిన్ ముఠాతత్వాన్ని ఎండగట్టడం ; 1871 నాటి పారిస్ కమ్యూన్లో ప్రజల అసంఘటితత్వం, 
కార్మికపార్టీ  లేకపోవటం వల్ల విప్లవం ఓడిపోవడం గురించి మార్క్స్ చెప్పడాన్ని లెనిన్ స్పష్టంగా అర్ధం చేసుకున్నాడు.  
ఆ తర్వాతనే, అలాంటి అవకాశవాదులైన  కాట్స్కీ, ట్రాట్స్కీల  విధానాల్ని ఎండగట్టాడు; రాజ్యాధికారం లక్ష్యంగా కార్మికపార్టీని
నిర్మిస్తూ, సోషలిజంలో ‘కార్మికవర్గ నియంతృత్వం ’పై  విశ్వాసం గల కార్యకర్తే అసలైన కమ్యూనిస్టు అన్నాడు. 

‘‘1905సం//లో బోల్షివిక్కులు మెన్షివిక్కులతో కలసి విప్లవ పోరాటంలో పాల్గొన్నా, 1906, 1910 సం//లలో సర్దుబాట్ల
తర్వాత కూడా వారి మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి.  కార్మిక, కర్షక, సైనిక ప్రతినిధుల ద్వారా విప్లవకరంగా ఏర్పడ్డ 
కౌన్సిల్లను ‘సోవియట్లు’ అన్న పేరుతో  స్వయం పాలన చేసుకునేవిగా తయారుచేశారు. 1914 సం//లో రష్యా చక్రవర్తి
జార్జ్ నికోలస్ II,1.10 కోట్ల మంది రైతులను మొదటి ప్రపంచ యుద్ధంలోకి లాగి, లక్షలమంది చావుకు, గాయాలకూ
కారణమయ్యాడు.  దీనితో విసుగెత్తిన రష్యన్ ప్రజలు, సైన్యం-- శాంతినీ, తిండినీ,  సామాజిక సమానతనూ కాంక్షిస్తూ, లెనిన్ 
నాయకత్వంలో విప్లవం చేశారు.  మొదటి ప్రపంచ యుద్ధాన్ని  సామ్రాజ్యవాదం రష్యాపై చేసే  జాతీయ యుద్ధంగా చిత్రించటాన్ని
లెనిన్  ఖండించి  అది సామ్రాజ్యవాద యుద్ధమని స్పష్టం చేశాడు.  సమ్మెల్లో లక్షలమంది వివిధ రంగాల కార్మికులు
పాల్గొనేవారు.  సోవియట్ల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని వారే నడిపేవారు.  నావికాదళం  యొక్క సహకారం 
విప్లవం చివరిదశలో మరువలేనిది.  1917 సం// ఫిబ్రవరి నాటి తాత్కాలిక ప్రభుత్వాన్ని కూలదోసి, సోవియట్లు అధికారాన్ని
స్వీకరించారు. ’’            (ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర,                                          నుండి) 
4. విప్లవ విజయం తర్వాత డిక్రీల జారీ :  
 ‘‘1917 వ సం// అక్టోబరు 25 నాటి సమావేశంలో లెనిన్ 2 డిక్రీలను జారీ చేశాడు. అవి--1.  దేశాల మధ్య విభేదాల 
పరిష్కారానికి యుద్ధం కాక, శాంతి ద్వారా పరిష్కారం కనుగొనాలన్నారు. ‘యుద్ధం’మానవజాతికి వ్యతిరేకమైన అపరాధాల్లో 
కల్లా మాహాపరాధమని డిక్రీ  ప్రకటించింది.  2.  భూమిని గురించిన డిక్రీలో భూస్వాముల కమతాలన్నింటినీ నష్టపరిహారం
లేకుండా స్వాధీనం చేసుకొని, ఆ భూములన్నింటినీ కష్టపడే రైతులకు పంచిపెట్టాలని డిక్రీ ప్రకటించింది. తర్వాత, రైల్వేలనూ,
పరిశ్రమలనూ, భూములనూ జాతీయం చేసింది.  జాతుల పీడనను అంతమొందించింది. స్త్ర్రీలకు సమాన హక్కులు కల్పించ-
బడ్డాయి.  ‘రైతులేం పరిపాలన పగ్గాలు చేపడతారులే ’అన్న కాట్క్సీలాంటి వారి ఎగతాళి వ్యాఖ్యల్ని ఖండిస్తూ, రైతులు 
బ్రహ్మాండంగా పరిపాలన  చేపట్టారు.  తనను తాను రక్షించుకోలేని విప్లవం నిరర్ధకం అన్న లెనిన్, రష్యా ను రక్షించే బాధ్యతను
 రెడ్ ఆర్మీకి అప్పగించాడు.’’     (ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర,                                          నుండి)   

‘‘1920 సం. లో  జరిగిన రెండవ కాంగ్రెస్ సమావేశంలో, 21 పాయింట్లద్వారా ' పార్టీ సభ్యుడంటే ఎవరు? 'ను నిర్వచిస్తూ 
వుండిన రష్యన్ పార్టీని మోడల్ గా ఆమోదిస్తూ, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ జరిగింది.  శీఘ్ర పారిశ్రామికీకరణ, ఒకదేశంలో 
సోషలిజం, కేంద్రీకృత రాజ్యాధికారం, సమిష్టి వ్యవసాయం, ఇతర కమ్యూనిస్టు పార్టీల ప్రయోజనాలు సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 
ప్రయోజనాలకు లోబడి వుండాలనే స్టాలిన్ పాలసీలకి అనుగుణంగా బోల్షివిక్ పార్టీ మారింది.’’
                    (‘ఎ డిక్షనరీ ఆఫ్ మార్క్సిస్ట్ థాట్’గ్రంథం నుండి , అనువాదం--వై.వి.ఆర్.)
స్టాలిన్ పై అపవాదులు, అతని అపజయాలు, తప్పులనే చూపుతూ ప్రత్యర్ధులు విమర్శలు చేసినా కూడా నాటి బోల్షివిజం,
ప్రపంచ విప్లవాన్ని సాధించటంలో ఒక ఆయుధంగా పనికొచ్చిందని చెప్పవచ్చు ;  ఈ చర్యలు ఆనాటి చారిత్రక ఆవశ్యకతే కాక,
పెట్టుబడిదారీ వ్యవస్థచే చుట్టూ ముట్టడించబడిన ఒక దేశం స్వీకరించదగినవే,  అవి ఆపలేని చర్యలే.

  5.  సామ్రాజ్యవాదం : లెనిన్ 1920 సం//లో చేసిన ఈ రచన, సామ్రాజ్యవాదంపై నేటికీ ఉత్కృష్టమైనదిగా నిలిచిపోయింది.
దీనిలో లెనిన్, సామ్రాజ్యవాదం అన్నా, ఫైనాన్స్ కాపిటల్ అన్నా ఒకటేనని వివరిస్తాడు.  విప్లవద్రోహి అని లెనిన్ అన్నటువంటి
కాట్క్సీ ప్రకారం, సామ్రాజ్యవాదం అంటే--యుద్ధం యొక్క ప్రాముఖ్యాన్ని చూపటం.  కానీ, లెనిన్ కి  సంబంధించి, యుద్ధం
అంటే--సామ్రాజ్యవాదం యొక్క రెండవ పార్శ్వం లేదా అది సామ్రాజ్యవాదపు బూచి.  అసలుకి సామ్రాజ్యవాదం ముఖ్య లక్షణం,
ఫైనాన్స్ కాపిటల్ చేసే నగ్న దోపిడీ, పరాన్నభుక్కుతత్వం.  సామ్రాజ్యవాదం అంటేనే--సోమరిజనసమూహ ఉత్పాదక యంత్రం.

  6. బోల్షివిక్ విప్లవం ఇచ్చిన ప్రేరణ : రష్యాలో విప్లవం ప్రారంభం కావచ్చునని మార్క్స్, ఎంగెల్స్ లు ఆనాడే ఊహించక పోలేదు.
దాని కనుగుణంగానే, రష్యా  ప్రపంచ విప్లవమనే శిశువుకు ఊయల అయింది, అది ప్రపంచ సోషలిస్టు ఉద్యమంలో అగ్రగామి 
పాత్రను అంగీకరించి, దానికి తగ్గట్టుగానే వ్యవహరించింది. దీని ప్రేరణతోనే యూరపులో సోషలిస్టు విప్లవాలు, ఇతర ఖండాల్లో
జాతీయ విమోచనోద్యమాలూ జయప్రదంగా జరిగాయి.
    
 7. బోల్షివిజంలో కూడా అనుకూల, ప్రతికూల గ్రూపులున్నాయి-- (1). మేధావులు, ట్రేడ్ యూనియన్ నాయకత్వాన్ని
బలపరుస్తూ, శ్రామికవర్గంపై పార్టీ అధికారాన్ని నిరసిస్తూ ట్రాట్స్కీ చేసిన పార్టీ లోపలి యుద్ధం.    ట్రాట్స్కీ పార్టీలోనే వుంటూ
తనలాంటివారి  గ్రూపుల హక్కుల గురించి మాట్లాడుతూ పార్టీని సంక్షోభంలోకీ, గందరగోళంలోకీ నెట్టే చర్యలు చాలా గట్టిగానే
చేశాడు.  1917 సం// కి ముందు లెనిన్ వీటిని నిరసిస్తూ పోరాటం చేశాడు.  బోల్షివిజం రాజ్యం చేస్తున్న సమాజాల్లోని ప్రజలు 
సోషలిస్టు విప్లవాన్ని చేసేంత  చైతన్యం  లేకపోవటం, ఉత్పత్తిశక్తుల అభివృద్ధిలేమి--వీటివల్ల  రాజ్యం  ప్రజలపై ఆధిపత్యపాత్ర
వహించింది అంటూ, ఈ దృష్ట్యా, బోల్షివిజం అనేది ఒక రాజకీయ అవకాశవాదంగా, ఆరోపిత విప్లవంగా వుండిందని మెన్షివిక్కుల
ఆరోపణ.  అయితే, పార్టీ యొక్క అధికారం శ్రామికవర్గంపైనా, ఇతర అన్ని విభాగాల పైనా కాలక్రమంలో ఎక్కువైందనేది నిజమే.
అయినాకూడా, అలనాటి యుద్ధం, అంతర్గత నిరసనల జోరువల్ల, మొదటి సోషలిస్టు దేశంలో ఆ మాత్రం పార్టీ పట్టు, పార్టీపై 
విధేయతా అవసరమే  అయ్యాయి. (2).  బోల్షివిజంలోని ఉత్పత్తి శక్తుల అభివృద్దే సోషలిజం స్థాపనకు మొదటి కర్తవ్యంగా 
సాగినదాన్నిమావోయిజం కూడా కాదంటూ, దాని ఉన్నతదశ కంటే ముందే వివిధ వర్గాల ప్రజల మధ్య సోషలిస్టు సంబంధాలు
నెలకొనాలంటూ తమ దేశ స్థితికి అనుగుణంగా ముందుకెళ్ళింది.  పెట్టుబడిదారీ విధానాలను కూకటివ్రేళ్ళతో  నిర్మూలించటం, 
ప్రజల్లో సోషలిస్టు భావనల్ని వ్యాప్తి చేయటం లాంటి వాటిని కూడా గట్టిగా నొక్కి చెప్పారు.  (3). రోజా లక్జెంబర్గు కూడా 
బోల్షివిజంలోని పార్టీ కేడరు  విధానం,  పార్టీకి విధేయత వల్ల, శ్రామికవర్గపు విప్లవాత్మక చర్యల్ని తగ్గించిందని అన్నారు.
                    (‘ఎ డిక్షనరీ ఆఫ్ మార్క్సిస్ట్ థాట్’గ్రంథం నుండి , అనువాదం--వై.వి.ఆర్.)
----కాలక్రమేణా యూరో కమ్యూనిజం ప్రభావం వల్లనూ, 1989 సం// తర్వాత సోవియట్ యూనియన్ పతనం వల్లనూ ,
బోల్షివిజం నమూనానే సోషలిజం, కమ్యూనిజం సమాజాలకి మార్గదర్శకం అనే సంప్రదాయ భావన తొలగిపోయింది.  అయితే, 
బోల్షివిజాన్ని సర్వకాలాలకూ, అన్ని దేశాలలో సోషలిస్టు స్థాపనకూ ఒక నమూనా  అని లెనిన్, స్టాలిన్ లు చెప్పలేదు.  యూరో
కమ్యూనిజంలోని ముఖ్య భావనల ప్రకారం, అసలు అక్కడ సోషలిస్టు రాజ్యాలే ఏర్పడలేదు.  అవన్నీ పెటీబూర్జువా ప్రజాస్వామ్య
ప్రభుత్వాలే. పరభాగ్యోప (parasitic) జీవన విధానాన్ని కల్గిన ఆ దేశాలలో సోషలిస్టు భావనలు రావటం చాలా 
సుదీర్ఘ ప్రస్థానమే.  కాబట్టి, అణచబడ్డ ప్రజలున్నఅభివృద్ధి చెందినటువంటి, వర్ధమాన దేశాల్లోనే ముందుగా విప్లవాలు వచ్చాయి.  
కాకుంటే, యుద్ధాల ఛాయల మాటున రష్యా, చైనాలలో నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విప్లవాలు 
వచ్చాయి.    సోషలిస్టు విప్లవం తర్వాత కూడా లెనిన్ బోల్షివిజం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ,  " ఏం చెయ్యాలి ? "   రచనలో,
కుట్రదారీ సంఘం, విప్లవకారుల సంఘం మధ్య భేదాన్ని చెబుతూ చాలా చక్కగా విప్లవాశ్యకతను వివరిస్తాడు;  గ్రూపిజాన్నీ, 
ముఠాతత్వాన్నీ నిరసిస్తాడు.  అణచివేత ఎక్కువగా గల రష్యాలో రహస్య  విప్లవ సంఘం కార్యకలాపాలు తప్పవని (రహస్య
ముఠా సంఘాలు కాదు) లెనిన్ అంటాడు.  వీటి గురించీ, రష్యన్ విప్లవం యొక్క మానవీయ, ధైర్య, త్యాగ గుణాల గురించీ,
అందులో ముఖ్యంగా స్త్రీల  అసమాన త్యాగం, పోరాటాల గురించీ , ‘అమ్మ’ లాంటి నవలలో వాటిని కళ్ళకు కట్టినట్లు 
చూపించిన  దాని రచయిత ‘మాక్సిం గోర్కీ’ గురించీ ఎన్నిసార్లు, ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఎందుకంటే--మానవ
సమాజాన్ని మలుపు తిప్పిన ఆ చారిత్రక యుగ సంఘటనలకి చరిత్రలో ఏదీ సాటి రాదు.  

 8. విప్లవం ఎప్పుడు చేయాలి ? : "ఆర్థిక, సాంస్క్ర్ఱృతిక రంగాల్లో రష్యా వెనుకబడి ఉంది కాబట్టి, ముందుగా అది  పెట్టుబడిదారీ
పరిస్థితుల్లో ఒక నిర్దిష్ట సాంస్కృతికాభివృద్ధి స్థాయిని అందుకోవాలనీ, ఆ తర్వాతే సోషలిస్టు విప్లవానికి పూనుకోవాలనీ కొందరు
మార్క్సిస్టులు అన్నారు.  రష్యా వెనుకబాటుతనాన్ని లెనిన్ గుర్తించాడు. అయినా, విప్లవం జరపాలంటే ఒక నిర్దిష్ట సాంస్కృతిక 
స్థాయిని అందుకునే వరకూ వేచి వుండాలన్న అభిప్రాయం పూర్తిగా అసంగతమైనదని ఆయన పరిగణించారు.అలా వేచి
వుండడం అంటే--రష్యా బాధాకరమైన, సుదీర్ఘమైన పెట్టుబడిదారీ దశను గడపాలన్నమాట.  రష్యాలోని జాతులకు లెనిన్ 
వేరొక విధమైన మార్గాన్ని ప్రతిపాదించారు.  పార్టీ దీనినే బలపరచి, అమలు జరిపింది.  శాస్ర్త్తీయ సిద్ధాంతంలోనూ, ప్రజానీకానికి
సారధ్యం వహించే కళలోనూ ఆరితేరిన విప్లవ శ్రామికవర్గ అగ్రదళం సోషలిస్టు విప్లవానికి ప్రజలను మేల్కొలిపింది.’’  

9. సోషలిజంలో ఏం చెయ్యాలి ? : ‘‘అదే సమయంలో, సోవియట్ రిపబ్లిక్ యువజనులు ఒక యావత్తు యుగం యొక్క 
మానవ సంస్కృతికి దూరమై, పూర్తిగా కమ్యూనిస్గు విలువలకు మాత్రమే పరిమితమైతే, వారు అఙ్ఞానులై, జీవితానికి పనికి-
రాకుండా పోతారని లెనిన్ ఎంతో భయపడ్డాడు.  నవసమాజ నిర్మాణంలో బూర్జువా మేధావులు పాల్గొనేలా చేయడం 
అవసరమని కూడా ఆయన భావించారు.  విఙ్ఞాన శాస్త్రానికీ, ఇంజనీరింగుకూ చెందిన వివిధ రంగాల్లోని ప్రవీణులు అందులో
పాల్గొనకపోతే, సోషలిజానికి పరివర్తన అసాధ్యమని ఆయన నొక్కి చెప్పారు.  అందువల్ల, తటస్థంగా వున్న ప్రవీణులనూ,
ఆ మాటకు వస్తే విప్లవ వ్యతిరేకులైన ప్రవీణులను కూడా, వారికి నవచైతన్యం కలిగించి, నూతన సామాజిక వ్యవస్థకు గల 
మహోజ్వల భవిష్యత్తును వివరించి, వారి మనసులను ఆకట్టుకోవడం ద్వారా ఉపయోగించుకోవడం అవసరమయింది.’’

10. కొన్ని సోషలిస్టు మార్పులు : 
‘‘1.ప్రజల  సాంస్కృతిక స్థాయి ఎంతో ఉన్నతమైనది : తిండి, వినోద దృశ్యాలూ వుంటే చాలు, చిక్కులన్నీ తొలగిపోతాయని 
వాదించేవారి అభిప్రాయాలను లెనిన్ వ్యతిరేకించారు. తిండి నిస్సందేహంగా అత్యవసరమైనదే.  కానీ, వినోద దృశ్యాలను లెనిన్ 
నిజమైన కళగా పరిగణించలేదు.  అవి ఇంచుమించు చవుకబారు ఆకర్షణలని ఆయన అన్నారు. చవుకబారు దృశ్యాలకన్నా
గొప్పవైన వాటిని ఆనందించగల అర్హత కార్మికులకూ, కర్షకులకూ ఉన్నదనీ లెనిన్ భావించారు.  నిజమైన గొప్పకళను 
ఆనందించే హక్కును వారు సాధించుకున్నారన్నాడు.’’
‘‘2. నీతి : మానవ సమాజం పురోగమించిన కొలదీ నీతి, అవినీతి అనేవి మారుతూ వచ్చాయి. ఈ మార్పులకూ, ప్రజల 
జీవిత పరిస్థితుల్లో వచ్చిన మార్పులకూ సంబంధం వుంది.  సమాజం శతృవర్గాలుగా విభజితమై వున్న పరిస్థితుల్లో నీతీ, 
దానిపట్ల వైఖరులూ ఒకటిగానే ఉండజాలవు, వర్గాతీతంగానూ వుండజాలవు.  అటువంటి సమాజంలో పరస్పర విరుద్ధమైన
నీతి సూత్రాలు తప్పనిసరిగా రూపొందుతాయి.  ఉదాహరణకు, వ్యక్తిగత ఆస్తిని నీతైనదిగానూ,పవిత్రమైనదిగానూ, అతిక్రమిం
చరానిదిగానూ పెట్టుబడిదారులు పరిగణిస్తారు.  కార్మికుని దృష్టిలోఅది సరైనది కాకపోవచ్చు.  ఉత్పత్తి సాధనాలూ, 
పరికరాలపై  వ్యక్తిగత యాజమాన్యాన్ని రద్దుచేయడం కోసం అతను పోరాడవచ్చును. ’’
‘‘3. పోటీ, సహకారం : అదేవిధంగా, ఎవరిమట్టుకు వారుండడమూ, ఒకరితో ఒకరు పోటీ పడడమూ ప్రజలు పరస్పర
సంబంధాల్లో అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాలని పెట్టుబడిదారులు భావిస్తారు.  కార్మికుడు అలా కాకుండా, సమిష్టి-
తత్వం కోసమూ, పరస్పర సహాయం కోసమూ పోరాడుతాడు. 
‘‘4.  మానవ స్వభావం : అహంభావము, పేరాశ, దురాక్రమణతత్వం, అధికార దాహం,  క్రౌర్యం, మొదలగునవి
మానవుని సహజ లక్షణాలనీ ; మానవ స్వభావమూ, నైతిక విలువలూ శాశ్వతమైనవీ, మారనివనీ బూర్జువాలు  తరచూ
వాదిస్తూ వుంటారు.  శాశ్వత నీతి అనే భావనను కమ్యూనిస్టులు నిరాకరిస్తారు.  శతృవర్గాలతో కూడిన సమాజం వున్న
పరిస్థితుల్లో సాగిన తీవ్రపోరాటం సందర్భంలో మానవుల్లోని దుర్గుణాలు తలెత్తాయి.  ఆ పరిస్థితులు అంతరించినప్పుడు  
అవి కూడా అదృశ్యమైపోతాయి.  కమ్యూనిస్టు తరహాలో విద్యాబుద్ధులను నేర్పినట్లయితే, మానవ స్వభావాన్ని కొత్తపుంతల్లో 
మలచడం త్వరితం కాగలదన్న వాస్తవ విషయం కమ్యూనిస్టుల అభిప్రాయానికి ఆధారం.’’  
                                                                            ( లెనిన్--విద్యపై, పి.డి.ఎస్.యు. ప్రచురణలో )
11. బోల్షివిక్ విప్లవం--వర్తమాన కర్తవ్యం : నేటి రష్యాలో కృశ్చెవ్, గోర్బచెవ్, ఎల్త్సిన్ కాలపు రివిజనిస్టులు, అమెరికా తొత్తుల 
అనుయాయులు కోకొల్లలు.  రష్యన్ కమ్యూనిస్టు పార్టీ  సుమారుగా నాల్గో వంతు వరకు ప్రజల్లో పట్టు కల్గి వుంది.  దారుణంగా
దెబ్బతిన్నరష్యాను పుతిన్ కొంతమేర పునరుద్ధరించాడు-- అయితే, కమ్యూనిస్టు పద్ధతుల్లో కాదు.  రష్యాలో కమ్యూనిస్టులు
బలపడకుండా ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలు నిరంతరం వారిని అణచివేస్తున్నాయి.  చైనాలో కూడా దేశ వనరులపై పేరుకే
ప్రభుత్వ ఆధిపత్యం వుంటుంది, నిర్వహణ అంతా MNCలదే.  ఇలా ప్రపంచమంతా ప్రస్తుతం ఒక స్తబ్ద స్థితిలోనూ, విప్తవాన్ని
తన గర్భంలోనూ నివురుగప్పి వుంచుకుంది.  పెట్టుబడి తన పని తాను చేసుకుపోతుంది అన్న మార్క్స్ మాట నిజమని 
అరబ్బు ప్రపంచంలో దశాబ్దాలుగా తనకు వ్యతిరేకంగా వున్న పాలకులను మార్చటానికి ‘గులాబీ విప్లవం’అన్న పేరు మీద
ఆ దేశాల్లో అలజడులు సృష్టించి, వారిని కుట్రలతో చంపి, తన తొత్తులను ఆ దేశాల్లో నియమించుకున్న దాన్ని బట్టి  తేటతెల్ల-
మౌతోంది.  ఇంకా, లాటిన్ అమెరికా దేశాల్లో  మంచి పట్టున్న కమ్యూనిస్టు దేశాధినేతలను సైతం కుట్రలతో దించి, తన తైనాతీ
పాలకులను గద్దెపై కూర్చోబెట్టింది.  ఇవన్నీ, అమెరికా, యూరప్ దేశాల యొక్క పక్కా ప్రణాళిక ద్వారా జరుగుతూనే 
వుండటానికి కారణం--ఇతర దేశాల్లోని ఆయిల్, సహజసంపదలను అతితక్కువ ధరకు కాజేయటమే కాక, ఆ దేశాల 
మార్కెట్లను తన చవకైన సరుకులతో నింపి, లాభాల్ని ఆర్జించటమే.  నేడు భారతదేశంలో జరుగుతున్న ‘ఆపరేషన్
గ్రీన్ హంట్’ కూడా ఆదివాసీ అటవీ సంపదను కాజేసే అలాంటి దోపిడీ ప్రణాళికే.  ఈ దోపిడీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి,
బోల్షివిక్ త్యాగభరిత చరిత్ర నుండి ప్రేరణ పొంది, వర్గ పోరాటం, సాంస్కృతిక పోరాటం రెండూ చేయాల్సిన తరుణమిది. 
దానికై ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఐక్య సంఘటన , మళ్ళీ ‘కమ్యూనిస్టు ఇంటర్నేషనల్’ స్థాపన అతితొందరగా
జరిగి తీరాల్సిన సమయమిదే.  ప్రతిరొజూ, ప్రతి సంవత్సరమూ, ఒకే విధమైన మూసపోసిన బతుకు బతుకుతూ , 
‘పాచిపోయిన మానవీయత’ను సంతరించుకునే మన ఈ జీవితాలను , నాచు పట్టని జలపాతాల వలె తీర్చిదిద్దుకుందాం.
మనం ఈ బూర్జువాలదే అయిన బూటకపు సంస్కృతినుండి బయటపడి, పాకుడు దరిచేరని పెనుప్రవాహాల వలె జీవిద్దాం.  
     
12. మానవజాతి విముక్తి : కాబట్టి, శ్రామిక వర్గ విముక్తి ఎందుకంటే--దాని విముక్తి చేసుకుంటేనే అది, మెత్తం మానవజాతిని
కూడా అది నాడు, నేడు కూడా ఈడ్చుకుంటూ వస్తున్న దోపిడీ, అసమాన జీవన విధానం, సంస్కృతుల నుండి విముక్తి
చేయగలదు కాబట్టి.  అంటే--మానవజాతి విముక్తికి శ్రామికవర్గ విముక్తి అనేది ఒక ముందస్తు షరతు అన్నమాట.  

  ‘‘నూరు పూలు వికసించనీ,  వేయి ఆలోచనలు సంఘర్షించనీ. ’’
                                  
                                                                                                                                వై.వి.ఆర్.

                                                                                                                          తేది : 31.10.2016